పదో తరగతి మార్కుల మెమోలో mee పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీలో తప్పులున్నాయా? వాటిని సరిచేయించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఒరిజినల్ SSC సర్టిఫికెట్లలో వివరాల సవరణ కోసం మీసేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. పాత ఆఫ్‌లైన్, మాన్యువల్ దరఖాస్తుల విధానానికి స్వస్తి పలికింది.
విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ నవంబర్ 18, 2026న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. Rc.No.100/UMC/SSC/2026 నంబర్‌తో విడుదలైన ఆదేశాల ప్రకారం, SSC ఒరిజినల్ సర్టిఫికెట్ల సవరణకు సంబంధించిన దరఖాస్తులను మీసేవ పోర్టల్ ద్వారానే సమర్పించాలి.
2026 ఆగస్టు 17 నుంచే ఈ ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై నేరుగా కార్యాలయాలకు వెళ్లి సమర్పించే భౌతిక దరఖాస్తులను స్వీకరించరు.
ఏయే వివరాలను సరిచేయించుకోవచ్చు?
SSC ఒరిజినల్ సర్టిఫికెట్లో తప్పులున్న విద్యార్థులు, గతంలో పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత నిబంధనల ప్రకారం సవరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థి పేరు- తండ్రి పేరు- తల్లి పేరు- పుట్టిన తేదీ- ఇతర వ్యక్తిగత వివరాల్లో అర్హత ఉన్న సవరణలు
అయితే ప్రతి మార్పుకు సంబంధిత ఆధారాలు, విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆమోదం అవసరం.
మీసేవలో దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
కొత్త విధానం ప్రకారం దరఖాస్తు ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఆన్లైన్లో కొనసాగుతుంది.
1. మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలి: ముందుగా సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి SSC సర్టిఫికెట్ సవరణ కోసం దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత ఆధార పత్రాలను అందించాలి.
2. పాఠశాల స్థాయిలో పరిశీలన: దరఖాస్తు విద్యార్థి పదో తరగతి చదివిన పాఠశాలకు వెళ్తుంది. ప్రధానోపాధ్యాయుడు ISMS పోర్టల్‌లో వివరాలను పరిశీలించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తారు.
3. MEO పరిశీలన: పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తును మండల విద్యాశాఖ అధికారి (MEO) పరిశీలించి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు.
4. DEO కార్యాలయంలో పరిశీలన: MEO ఆమోదించిన దరఖాస్తు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) కార్యాలయానికి చేరుతుంది. అక్కడ సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత DEO ఆమోదం కోసం పంపిస్తారు.
5. ఉన్నతాధికారుల ఆమోదం: అనంతరం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ పరీక్షల విభాగం పరిశీలన జరుగుతుంది.
6. సవరించిన మెమో: తుది ఆమోదం లభించిన తర్వాత సరిచేసిన SSC మెమోను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
దరఖాస్తు తిరస్కరిస్తే కారణం చెప్పాల్సిందే!
కొత్త విధానంలో మరో ముఖ్యమైన అంశం అధికారుల జవాబుదారీతనం. దరఖాస్తును పాఠశాల, MEO, DEO లేదా ఇతర స్థాయిలో తిరస్కరించినట్లయితే అందుకు సంబంధించిన కారణాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దరఖాస్తుదారులకు తమ అప్లికేషన్ ఎందుకు తిరస్కరణకు గురైందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు ఏం చేయాలి?
మీ పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులుంటే ముందుగానే వాటిని సరిచేయించుకోవడం మంచిది. అవసరమైన ఆధార పత్రాలు, దరఖాస్తు ఫీజు వివరాల కోసం సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించండి.
ఇకపై SSC ఒరిజినల్ సర్టిఫికెట్ సవరణలకు నేరుగా విద్యాశాఖ కార్యాలయాలకు మాన్యువల్ దరఖాస్తులు పంపినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
పదో తరగతి సర్టిఫికెట్లో తప్పులున్నాయా?
మమతలబు
2 నిమిషాల పఠనం
పెద్దదిగా చూడండిఈ కథనంలో పొరపాటు లేదా నవీకరణ ఉందా?
మరిన్ని వార్తలు
ప్రధాన పేజీకి వెళ్లండిమతలబు ముఖ్యాంశాలు & తాజా విశ్లేషణలు
రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు ప్రధాన వార్తల కోసం మా హోమ్ పేజీని సందర్శించండి.
