ముసురువెట్టిన పల్లె..!!
1 min read
ముసురువెట్టిన పల్లె
పల్లె అంత తడిసి ముద్దైపోతుంటే,
మూడోతరగతి పోరడుకూడా పారవట్టి పొలం పోతే,
నాట్లు పట్టిన గీ పదిహేను రోజుల నుండి పల్లెకేదో కొత్త పండుగ అచ్చినట్టు అనిపిస్తుంది.
జాతరేదో జరిగినట్టు మడులల్ల ట్రాక్టర్లు, చెక్కర్లు కొడుతున్నాయ్.
ముసలవ్వలు, పడుసు తల్లులు అంత గలిసి మాల్యాలు గట్టి, భూతల్లికి పల్లె తల్లులు అంత ఆకుపచ్చ చిరకట్టినట్టు నాట్లేస్తుంటే,

మల్లల్ల నీళ్లు మత్తడెక్కి పారుతుంటే పల్లెతల్లులు పాటలు అందుకొని పని కానియ్యవట్టె.
గిదంతా మంచిగానే ఉంది కానీ ఈ పల్లె తల్లికీ ఇంత అందాన్నిస్తున్న గీ పల్లె తల్లుల గురుంచి చెప్పాలి.
మీదికెళ్లి ముసురువెట్టి పానం అంత గజగజ అనుక్కుంటా,
పొద్దంతా వంగి వంగి నాటేస్తే, నడుంమొత్తం గుంజుతున్న కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని ఓకలికంటే ఒకరు పోటివెట్టుకొని మునుము ముంగట పోతుంటే,
కాళ్ళు అన్ని రోషి కష్టాంగా ఉన్న ఇంటికైతే చేరి గింత బుక్కెడంత వేడి బువ్వ కడుపులవడి. కన్ను అంటుకుంటే చాలు అనే చిన్న చిన్న ఆశలు ఈ పల్లె తల్లులకు.
పొద్దంతా గూకి గొడ్డు గోదా ఇంటికి చేరిన…అంచిన నడుం ఎత్తకుండా…ఇంకో అద్దెకురమో, పదిగుంటలో నాటు అయితదని చిన్న ఆశ…ఇ పల్లె తల్లులకు
ఇప్పటి మోడ్రన్ మహాలక్ష్మిలు, స్టార్ మహిళాల సంగతి ఏమో కానీ.నిజంగా గి పల్లె తల్లులకు..భూతల్లికీ ఉన్నంత ఓపిక ఉంది.
గా మండుతున్న కాళ్లను, బిటెక్స్ డబ్బానే ప్రేమగా తాకుతుంది. గుంజుతున్న నడుముకు, నమారు మంచమే జోలపాడుతుంది. ముసురుకు అనుకుతున్న పెయ్యికి గా ప్లాస్టిక్ కవరే ఆప్యాయంగా అలుముకుంది.

పొద్దంతా ప్రపంచానికి తిండి పెట్టడానికి అక్కడ పొలంల నాట్లేసి అచ్చి మల్ల ఇంటికాడ..మనకు అన్నం పెట్టడానికి.బొల్లు అని,కూరగాయలు అని, వంటలని, బట్టలని, నాన చాకిరీ చేసి కష్టాన్ని గుండెల్లో దాచుకునే భూతల్లి నా తల్లి.
మన మొగోళ్ళు గింతంతా కట్టాం కాంగానే…అబ్బా ఇయ్యాల బాగ కట్టాం అయింది అని.నైంటీలు, కోటర్లు, తాగుతారు…మరి గి తల్లులకు ఎన్ని కోటర్లు పోస్తారు…కానీ వాళ్లకు కావాల్సింది ఇ కోటర్లు, బీర్లు కాదు ఏదో కొంత ఆప్యాత ప్రేమ అంతే వాళ్లకు కావాల్సినవి.
పిల్లలకు కూడా చెప్పేది ఒక్కటే…అంత కష్టం చేసే అమ్మకు మీరు ఆస్తులెం ఇవ్వక్కర్లేదు…మీరు కొంచెం సేపు ఫోను, టీవీ పక్కకు పెట్టి అమ్మ వచ్చే సరికి.వేడి నీళ్లు, ఇల్లు ఉడ్చి, వంట చేసి అమ్మకు కొంచెం కష్టాన్నైనా తగ్గించండి రామునికి ఉడతా సాయంలా.
ముందు ఈ పల్లె అందాలు,ప్రకృతి పచ్చదనం గురుంచి మొదలు పెట్టిన కానీ, ఆ పల్లె అందాలకు కారణం అయినా ఈ పల్లె తల్లుల కష్టాల గురించి చెప్పేలా చేసింది ఈ భూతల్లి.

ప్రశాంత్ గోపతి
రచయిత