చెలిమి చెలిమె
(01 ఆగష్టు ‘అంతర్జాతీయ స్నేహ దినం’ సందర్భంగా)
ప్రేమ సమ్మిళిత సాగరంలో..
సాంత్వనను కూర్చే స్నేహమేగా..
సకల సంతోషాల కోవెల
పరమానందపు అంచుల్ని..
పరిచయ చేసే అద్వితీయ వరం
నరలోకంలో సజీవంలో స్నేహం !
దుఃఖసాగరపు పడవలో..
సుఖప్రాప్త లేపనామృతం
వర్ణ వర్గ కులమత వివక్షలను..
చెరిపేసే అద్వితీయ నేస్తం
కన్నీటిని ప్రేమతో తుడిచే హస్తం
ఆనంద భాష్పాల నదీ ప్రవాహం !
బేషరతైన ప్రాణమిత్రుడేగా..
చెలిమి చెలిమె మహోన్నత ధార
స్నేహ సుగంధాల సన్నిధి
సకల ఐశ్వర్యాల మనో పెన్నిధి
అద్వితీయ ఆస్థేగా పసందైన దోస్తీ !
ముళ్ళబాటలో పూలను పరిచే..
నిస్వార్థ నికార్సైన అభయహస్తం
మచ్చలేని మనో నిబ్బరం
అమ్మ పాలంత స్వచ్ఛం
ఎవరూ పూడ్చలేని స్థానం
ప్రత్యామ్నాయమే లేని స్నేహం !
ఎడారిలో చన్నీరైన స్నేహం
బాధలో ఉపశమన స్పర్శ
మనసును మైరపించగల..
అసాధరణ అమోఘ అక్షయపాత్ర
కాలచక్రంలో కందెనే కాదు మైత్రి..
తడబడినపుడు ఊతకర్ర కూడా !
స్నేహానికి గుర్తు శ్వేత వర్ణం
రంగుల సింగిడి మిత్ర ప్రసాదం
వాసనలో మల్లెల సుగంధం
రుచిలో అమృత ఔషధం
సుఖదుఃఖాల వెంటే నేస్తం
సర్వరోగ నివారిణే కదా స్నేహం !
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి