హరీష్ రావు గారికి నమస్కరిస్తూ
శ్రీయత గౌరవనీయులైన తెలంగాణ ఆర్థిక మంత్రివర్యులు శ్రీ. టీ. హరీష్ రావు గారికి నమస్కరిస్తూ రాయునది ఏమనగా!
విషయం: బెజ్జంకి మండల పర్యటనకు వస్తున్న మీకు గత పర్యటనల్లో మీరు ఇచ్చిన హామీల గురించి.
మీరు సిద్దిపేట ఎమ్మెల్యే గా గెలిచిన, తెలంగాణ మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కిచ్చుకున్న ప్రతిసారి బెజ్జంకి మండల ప్రజలు మురిసారు. మన బెజ్జంకి బిడ్డ అని గర్వ పడ్డారు.
మీరు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా 2016లో బెజ్జంకి ని కరీంనగర్ నుండి వేరు చేసి సిద్దిపేటలో నేను ఉన్నా!! సిద్దిపేట నియోజకవర్గములో చేసినట్టే బెజ్జంకి ని అభివృద్ధి చేస్తాము అని చెబితే మిమల్ని ఆదరించారు మండల ప్రజలు. కానీ 5 సంవత్సరాలు కావస్తున్నా మీ హామీల జల్లు ఇంకా కురవట్లేదు?
మొదటిసారి మంత్రి అయినప్పటి నుండి బెజ్జంకి పర్యటనలో కురిపించిన వరాల జల్లు మీకు గుర్తుందా మంత్రి గారు.
- పోతారం నుండి బెజ్జంకి మీదగా వడ్లూర్ బేగంపేట వరకు డబుల్ రోడ్డు ( 2017 పర్యటనలో )
- లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి 15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ( 2015, 2017,2018 మరియు 2019 పర్యటనలలో మీరు మాట్లాడ్డం జరిగింది)
- 20 కోట్లతో తోటపల్లికి పర్యాటక శోభ…బ్లూ ప్రింట్ కూడా విడుదల చేసారు ( మే 5, 2017 నాడు)
- రూ. కోటితో శంకుస్థాపన వేసిన బెజ్జంకిలోని అంబెడ్కర్ అరుంధతీ కళ్యాణమండపం ( జులై 3 2017)
- బెజ్జంకి మండల కేంద్రంలో పాలిటెక్నిక్ మరియు డిగ్రీ కాలేజీలు ( 2015, జూన్)
- మండలంలోని మహిళలకు 50 శాతం సబ్సిడీతో మిషన్లు అందించి స్వయం ఉపాధి అందిస్తాను అన్న హామీ( 2017 జులై)
- దసరా నాటికి డబల్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పంపిణీ చేస్తాము అన్న హామీ( 2017, జులై 23 నాడు )
- ఉమ్మడి బెజ్జంకి మండలంలోని ప్రతి గ్రామంలో మహిళ సంఘం భవనాలు.
- బెజ్జంకి మండలంలోని చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరికరణ పనులు( 2018 మే )
- బెజ్జంకి క్రాసింగ్ వద్ద ( దాచారం) పారిశ్రామిక వాడ( 2017)
- ఇంకా బేగంపేట గ్రామంలో టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యి 3 సంవత్సరాలుగా శిలాఫలకనికే పరిమితం అయిన రెండు పడక గదుల.
- తోటపల్లి, చీలపూర్ మరియు బెజ్జంకి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి నోచుకోని రెండు పడక గదుల ఇండ్లు.
- కల్లెపల్లి మరియు దాచారం గ్రామాల్లో శిలాఫలకలకే పరిమితం అయిన డబల్ ఇండ్లు.
- బెజ్జంకి మండల కేంద్రంలో మధ్యలోనే ఆగిన స్వర్ణకారుల భవనం.
- బెజ్జంకి మండలానికి 100 పడకల ఆసుపత్రి( 2015)
- 2018 నుండి శిలాఫలకనికే పరిమితం అయిన బెజ్జంకి మండల కేంద్రంలో ని పాఠశాల నూతన భవనం.
- గత సంవత్సరం వర్షాలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన బేగంపేట – బెజ్జంకి కల్వర్టు, బేగంపేట- తలరివానిపల్లి కల్వర్టు, గూడెం- కల్లెపల్లి, గూడెం- తాళ్లపల్లి, పోతారం నుండి బెజ్జంకి దారిలో ఉన్న కల్వర్టు, గుండారం గ్రామంలోని మరియు గుగ్గిళ్ల వాగుపై దెబ్బతిన్న కల్వర్టులకు నిధులు కేటాయిస్తూ త్వరగా నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు.
బెజ్జంకి మండల పర్యటనకు ఎప్పుడు వొచ్చిన…నేను బెజ్జంకి బిడ్డను అంటారు…!!!
కానీ మీరు బెజ్జంకి మండలం ఫై మరియు మండల ప్రజలపై చూపించేది సవతి తల్లి ప్రేమ కాదా….??
మీరు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చక చక చేస్తారు…కానీ బెజ్జంకి మండలంలో సంవత్సరాలు అయినా పనులు అడుగు కూడా ముందుకు పడవు.
జిల్లాల పునర్విభజనలో బలవంతంగా సిద్దిపేటలో కలిపింది అభివృద్ధి చేయడానికా…? లేక మీ స్థానికత నిరూపించుకోవడానికా…!!!
మంత్రి గారు, మీరు స్థానికత కోసం బెజ్జంకిని సిద్దెపేటలో కలపలేదు అనుకుంటే….మీరు ఇచ్చిన పై హామీలు మరియు మండలంలో నెలకొన్న సమస్యలు ఎందుకు చొరవ చూపట్లేదు?
ఇన్ని సంవత్సరాలు అయినా మీ మాటలు నీటి మీద రాతలాగే ఎందుకు మిగిలాయి…!
దయచేసి రేపటి బెజ్జంకి మండల పర్యటనలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి , బెజ్జంకి మండల అభివృద్ధికి కట్టుబడి ఉంటారని ఆశిస్తూ
పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి