ఆకాశపు అంచులు దాటనున్న మన బండ్ల శిరీష
శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో 1987లో డా: మురళీధర్ అనురాధ బండ్ల తల్లితండ్రులకు జన్మించారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా తరువాత భారత్‌లో పుట్టిన 34-ఏండ్ల మహిళ శిరీష బండ్ల అమెరికన్ 2వ మహిళగా రోదసియానం చేసే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రముఖ ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ జూలై 11న చేపట్టనున్న ప్రైవేట్ యాజమాన్య మానవసహిత వ్యోమనౌక ‘వియస్‌యస్ యునిటీ-22’లో వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ నేతృత్వంలోని జట్టు సభ్యురాలిగా రోదసియానం చేసి చరిత్ర సృష్టించనుంది. శిరీష ‘వీయస్‌యస్ యునిటీ’లో ప్రయాణించనున్న ఆరుగురు సభ్యుల జట్టుతో కలిసి జూలై 11, 2021న రోదసియానం ప్రారంభించనుంది. ఈ అరుదైన రోదసి ప్రయాణంలో ఏరోనాటికల్ ఇంజనీరైన శిరీష బండ్ల పరిశోధకురాలిగా అన్వేషణలు చేయనుంది. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన శిరీష, జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి యంబిఏ పిజీ పట్టా పొందింది. ‘కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్’లో స్పేస్ పాలసీ విభాగంలో ఉద్యోగం చేశారు. ఈ ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌక 9 రోజులు రోదసిలో ప్రయాణిస్తూ పలు పరిశోధనలు చేయనుంది. ఇలాంటి అరుదైన అపూర్వ అవకాశం దక్కించుకున్న మన తెలుగింట అమ్మాయి శిరీష రోదసియాన చరిత్రలో రికార్డు సృష్టించనుంది. శిరీష ప్రతిభను గుర్తించిన ‘తానా’ సంస్థ శిరీషకు ‘యూత్ స్టార్ ఆవార్డు-2014’తో సన్మానం కూడా చేయడం జరిగింది.
ప్రస్తుతం టెక్సాస్‌లో నివసిస్తున్న శరీష బండ్ల 2015 నుంచి వర్జిన్ గలాక్టిక్ సంస్థలో సేవలు అందిస్తూ ‘గవర్నమెంట్ అఫేర్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్’ విభాగంలో ఉపాధ్యక్షురాలి స్థాయిలో ఉద్యోగం చేస్తున్నది. శిరీష బండ్ల తన జీవితంలో దృష్టి లోపంతో అనేక ఒడిదుడుకులను అధిగనమించి ఈ స్థాయికి చేరడం హర్షదాయకం. శిరీష ఐదవ ఏటనే తన తండ్రి డా: మురళీధర్ బండ్ల అగ్రికల్చర్ సైంటిస్ట్‌గా ఉద్యోగ వేటలో 25 ఏండ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఓక్లహామా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశారు. అనంతరం తన తండ్రి ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా స్థిర పడ్డారు. రోదసిలోకి ప్రయాణించనున్న నాలుగవ భారత సంతతికి చెందిన వ్యోమగామిగా శిరీష నిలుస్తున్నది. శిరీష బండ్ల ‘అమెరికన్ ఆస్ట్రొనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్’ బోర్డ్ డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ విశ్వవిద్యాలయ ‘యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ సభ్యురాలిగా పని చేసింది. సమీప భవిష్యత్తులో ప్రైవేట్ వ్యోమనౌకలో అమెజాన్ అధినేత బిలియనేర్ జఫ్ బెజోస్ కూడా రోదసియానం చేయనున్నారు. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ అంతరిక్షంలోకి పంపించిన 747 విమానయాన ప్రయోగంలో శిరీష తన నైపుణ్య సేవలను అందించారు. యుయస్ ఏయిర్ ఫోర్స్‌లో పైలెట్‌గా ఎదగాలనుకున్న శిరీష ప్రైవేట్ అంతరిక్ష వ్యోమనౌకలో రోదసియానం చేస్తూ పరిశోధనలు చేయడానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వియస్‌యస్ యునిటీ వ్యోమనౌకలో రిచర్డ్స్ బ్రాన్సన్ నేతృత్వంలో శిరీషతో పాటు బెత్ మోసెస్, కోలిన్ బెన్నెట్, డేవ్ మఖే మరియు మైఖేల్ మసూసీలు 9-రోజుల పాటు రోదసియానం చేయనున్నారు.
శిరీష తాతయ్య బండ్ల రాగయ్య వ్యవసాయ శాస్త్రజ్ఞుడిగా ఆంధ్రప్రదేశ్‌లో పని చేశారు. బండ్ల రాగయ్య ప్రేరణతోనే శిరీష ఎదిగిందని గుర్తు చేస్తున్నారు. అచ్చ తెలుగు ఆరనాల అమ్మాయి శిరీష రోదసిలోంచి ‘సారె జహాసె అచ్చా హిందూ సితా హమారా’ అని ముచ్చటగా పాడనుంది. అంతరిక్ష యానం చేసే తొలి తెలుగు మహిళగా శిరీష భారతీయ శాస్త్రసాంకేతిక సత్తాను విశ్వమానవాళికి పరిచయం చేయనుంది. వర్జిన్ గెలాక్టిన్ నిర్వహించనున్న 4వ అంతరిక్షయానం 11 జూలై 2021న ఉదయం న్యూమెక్సికో నుంచి వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత సంతతికి చెందిన రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ తరువాత 4వ వ్యోమగామిగా, భారత్‌లో పుట్టిన 2వ మహిళా వ్యోమగామిగా శిరీష చరిత్ర తిరగరాయనుంది. ఆకాశపు అంచులు దాటుతూ అంతరిక్షంలోకి తొలి అడుగులు వేయనున్న తెలుగమ్మాయి శిరీష రోదసియానం సాఫీగా సాగాలని, అద్వితీయ పరిశోధనా ఫలితాలు సాధించి దివి నుంచి భువికి తిరిగి రావాలని ఆశిద్దాం. తెలుగు వారిగా మనందరం శిరీషకు అభినందనలు, ఆశీర్వాదాలను అందజేద్దాం. ఆల్ ది బెస్ట్ శిరీష, మే గాడ్ బ్లెస్ యు.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి