గోరుచుట్టుపై ‘బండ’ పోటు
కరోనా అలల సునామీ ఓ వైపు..
ఉద్యోగ ఉపాధుల కరువు మరో వైపు
గోరుచుట్టుపై ‘బండ’ పోటు బాధలు
దెబ్బ మీద దెబ్బతో కుదేలైన జీవులు !
పెట్రో డిజిల్ కక్కుతున్న ఇం’ధన’ సెగలు
భగ్గుమన్న వంటింటి గ్యాస్ మంటలు
బరువెక్కిన బడుగుల బండ బతుకులు
మసకబారుతున్న పేదోడి జీవితాలు !
పైపైకి పాకుతున్న ధరాఘాతాలు
సామాన్యుడి జేబుకు భారీ చిల్లులు
దిక్కులేని వారికి లేరెవరూ దిక్కు..
దేవుడే నిస్సహాయుడైన అకాలాలు !
సెంచరీ దాటిన పెట్రో కొరడా దెబ్బలు
విజృంభిస్తున్న ద్రవ్యోల్బణ విష కోరలు
ఆకలితో అలవటిస్తున్న దీనజనులు
సతమతమవుతున్న సగటు కుటుంబాలు !
కుతకుత ఉడుకుతున్న బండ రేట్లు
పేదోడి తలపై సిలిం’డర్’ పేలుళ్లు
కన్నీరే ఇంకిన పోయిన జీవచ్ఛవాలు
ఆదుకునే నాధుడే కానరాని అభాగ్యులు !
పేదోడి పొయ్యిలో పిల్లుల నిద్రలు
మాడుతున్న పేగుల్లో ఎలుకల పరుగులు
చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగాలు
గాల్లో దీపాలైన నిరుపేద గుండెలు !
ధరలకు బదులు ధైర్యాన్ని..
ఆకలికి బదులు అన్నాన్ని..
కన్నీటికి బదులు మానవత్వాన్ని..
పెంచి పోషించి చేయూతనిద్దాం !
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి