గ్రంథాలయాల ఘనమైన చరిత్ర లో మన తెలుగు వారి పాత్ర
దేశంలో, సమాజంలో, మనిషి ఆలోచనలలో మార్పు రావాలంటే, గ్రంథాలయాలు ఎంతో అవసరం అని మన పూర్వికులు ఎప్పుడో గమనించారు. గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహించారు. దేశానికి స్వతంత్రం రావాలన్నా, ప్రజలలో అవగాహన పెరగాలని, ప్రజల భాగస్వామ్యం స్వాతంత్రోద్యమంలో పెరగాలంటే, ప్రజలలో జ్ఞాన, చైతన్య వంతులు గా మారడం వల్ల మాత్రమే సాధ్యమని భావించారు. సమాచారం నలుమూలల చేరాలంటే, దేశంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రజలకి తెలియాలంటే, గ్రంధాలయాలు గ్రామ గ్రామాన ఉండాలని భావించారు. దేశంలో మొట్టమొదటి గ్రంథాలయ అసోసియేషన్ మన తెలుగు వారిదే అని చెప్పుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో గర్వకారణం. ఆంధ్ర ప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ (APLA)దేశంలో మొట్టమొదటి లైబ్రరీ అసోసియేషన్ 1914లో ఏర్పడింది.
అయ్యంకి వెంకట రమణయ్య గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు ఇలా ఎంతోమంది గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించి, గ్రంథాలయ ఏర్పాటుకు ఒక చట్టం కావాలని భావించి, ఆ దిశలో ఎంతో కృషి చేశారు. దేశంలో గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథాలయాల చట్టాల కోసం దేశమంతా ఒక్కతాటిపైనా నడిచేలా చేశారు.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన తెలుగు లైబ్రరీ అసోసియేషన్ చరిత్ర గురించి దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంఘ సేవకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మీకు తెలుసా??
దేశంలో మొట్టమొదటి లైబ్రరీ జర్నల్ మన తెలుగువారిదే.
ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్ ని నిర్వహించింది కూడా మన తెలుగు వారే.
ప్రజలను అక్షరం వైపు జ్ఞానం వైపు ప్రయాణం చేయడం కోసం లైబ్రరీ యాత్రలను (Library Piligrimages) చేపట్టింది మన తెలుగు వారే.
గ్రంథాలయ వేద (Library Anthem) నీ దేశానికి అందించింది మన తెలుగు వారే.
ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు కాకముందే, హైదరాబాద్ సంస్థానం గా ఉన్న మన తెలంగాణ ప్రజలు స్వాతంత్రం రాగానే హైదరాబాద్ లైబ్రరీ యాక్ట్ 1955 ఏర్పాటు చేసుకున్నారు.
అంటే గ్రంథాలయాల యొక్క అవసరం పట్ల తెలంగాణ ప్రజల అవగాహన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఇలా ఎంత లెక్కపెట్టిన నా మిగిలిపోయే నక్షత్రాల లాగా గ్రంథాలయాల ఘనమైన చరిత్ర గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది.
• దేశంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాలు ఎన్నో మన తెలంగాణలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి
• 1901లో హైదరాబాదులో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం.
• 1904లో వరంగల్ లో ఏర్పాటు చేసిన ఏర్పాటుచేసిన నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం.
• 1918లో నల్గొండ ఏర్పాటు చేసిన ఆంధ్ర సరస్వతి గ్రంధాలయం.
• 1918 లో ఖమ్మం లో ఏర్పాటుచేసిన రెడ్డి హాస్టల్ లైబ్రరీ
• 1920లో ఖమ్మం లో లైబ్రరీ ఏర్పాటు చేసిన ఆంధ్ర భాషా నిలయం.
ఇవన్నీ మన పెద్దలు సమాజ అభివృద్ధికి ఏర్పాటు చేసిన పీఠాలు.
వీటిని అభివృద్ధి చేయడం, వీటిని పరిరక్షించుకోవడం, మన బాధ్యత.
గ్రంథాలయాలు అంటే పుస్తకాలే కాదు మన సంస్కృతిని, చరిత్రని భావితరాలకు అందించే అమూల్యమైన ఆభరణాలని రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదీ.
మౌనంగా ఉండటం , కదలకుండా చదవటం, ఈ జనరేషన్ కి అలవాటు కావాలంటే, సహనం, ఓర్పు మనిషిలో పెరగాలంటే, మనమంతా కుటుంబ సమేతంగా గ్రంథాలయాల బాట పట్టాల్సిందే.
ర్యాంకుల గోలలో తలమునకలయ్యే తల్లిదండ్రులు, ప్రైవేట్ యాజమాన్యం వారు పిల్లల సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిందే.
చిన్న విషయాలకే, చిన్నబుచ్చుకునే మనస్తత్వం మారాలంటే, సమస్యలను చేధించలేక ఆత్మహత్య ను ఆశ్రయించే మనస్తత్వం మారాలంటే, మనమంతా గ్రంథాలయాల బాట పట్టాల్సిందే.
Sandhya Gopaldas